పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్టు

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : వైసిపి నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని శనివారం సాయంత్రం తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. చంద్రగిరి టిడిపి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్‌రెడ్డిని బెంగుళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఎన్నికల అనంతరం పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించడానికి వెళ్లిన పులివర్తి నానిపై మోహిత్‌ రెడ్డి అనుచరులు ప్లాన్‌ ప్రకారం దాడి చేశారు. కారులో ఉన్న కెమెరాల్లో దాడి దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఘటనలో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పరారీలో ఉన్నారు. 307 సెక్షన్‌ కింద ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మోహిత్‌ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బెంగళూరులో ఉన్నట్లుగా తెలియడంతో వెళ్లి అరెస్టు చేశారు.

➡️