ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకి)తో విద్యుత్ పంపిణీ సంస్థలు చేసుకున్న ఒప్పందాన్ని ఏం చేయాలన్న విషయమై ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. టిడిపి కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ ఒప్పందాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని విలేకరులు అడగగా ఏం చేయాలో ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటే జరిమానా కట్టాల్సి ఉందన్నారు. అన్ని వైపుల నుంచి ఏది మంచి అనేది బేరీజు వేస్తున్నామని తెలిపారు. అయితే అదాని-సెకి ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తూ కేంద్ర మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇటీవల లేఖ రాశారు. అదాని సెకి ఒప్పందంలో కొన్ని క్లాజ్‌ల కింద, ప్లాంట్ యాజమాన్యాలు ముడుపులు చెల్లించిన విషయాల ఆధారంగా, ఫోర్స్ మేజర్ కింద ప్రభుత్వానికి ఒప్పందాన్ని రద్దు చేసే అవకాశం ఉందని ఆయన లేఖలో వివరించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సిబిఐ, ఇడి, సిబిడిటిలతో కేంద్రం దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరాలని, కేంద్రం అంగీకరించకపోతే రాష్ట్రం నేరుగా దర్యాప్తుచేయవచ్చని కూడా ఇఎఎస్ శర్మ సూచిచారు. అయితే, ముఖ్యమంత్రి ఈ విషయాల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ‘ఏం చేయాలో ఆలోచిస్తున్నాం.’ అని మాత్రమే ఆయన చెప్పారు.
ధాన్యం కోనుగోళ్లు వేగవంతం
కొనుగోళ్లల్లో రైతులకు అన్యాయం జరుగుతోందని, రైతులకు ధాన్యం బస్తాలను తక్కువ చూపుతున్నారని సిఎం దృష్టికి ఒక విలేకరి తీసుకురాగా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు వాట్సప్ నెంబర్ అందుబాటులో తీసుకొచ్చామని చెప్పారు. అందులో నెంబర్ రిజిస్టర్ చేయగానే ఐవిఆర్‌ఎస్ ద్వారా సందేశం వెళ్తుందన్నారు. తద్వారాఆ రైతుకు చెందిన ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగిందో లేదో తనిఖీ చేస్తున్నామని చెప్పారు. ఇటీవల తుఫాన్ సంభవించిన సమయంలో రైతులపై భారం పడకుండా ధాన్యాన్ని మిల్లులకు ప్రభుత్వమే తరలించిందని తెలిపారు. ఎక్కడైనా చిన్న ఇబ్బంది వచ్చినా ప్రభుత్వాన్ని నిందించటం సహజంగా జరిగే ప్రక్రియే అని అన్నారు. ఇసుక వాహనాలకు ఉచితం అనే బోర్డు పెట్టి ఎన్ని టన్నులైనా రవాణా చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాకినాడ పోర్టు, సెజ్‌ల్లో బలవంతంగా వాటాలు రాయించుకున వ్యవ్యహారం ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో చూడాల్సి ఉందన్నారు. ప్రస్తుతం భూవివాదాలపై ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని చెప్పారు. అధికారులు పరిష్కారం చూపకుండా మరో అధికారికి బదిలీ చేస్తున్నారని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారికి పరిష్కారం లభించే అంశంపై కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. 22ఎ భూముల అంశంపై చిక్కుముడులు అనేకం ఉన్నాయని తెలిపారు. ‘రాజధానిలో ఎప్పుడు ఒక ఇంటి వారవుతున్నారు’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆ పనులను తన ఇంటి హోమంత్రి (భువనేశ్వరి), కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని చెప్పారు. రాజధాని నిర్మాణం మాత్రమే తాను చూస్తానని,తన ఇంటి నిర్మాణ వ్యవహారాలు కుటుంబ సభ్యులు చూసుకుంటారని వెల్లడించారు.