- కమ్యూనికేషన్‌కు మాత్రమే ఇంగ్లీష్ అవసరం
- నోరి దత్తాత్రేయుడు రచించిన ‘మంటాడు టు మ్యాన్ హ్యాటన్’ గ్రంథావిష్కరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి- విజయవాడ అర్బన్ : ‘మనం తీసుకునే ఆహారమే మెడిసిన్… వంట గదే ఫార్మసీ. సరిగ్గా అనుసరిస్తే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కేన్సర్ వస్తే డాక్టర్ వైద్యం చేస్తారు. రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు రచించిన ‘మంటాడు టు మ్యాన్ హ్యాటన్’ గ్రంథావిష్కరణ విజయవాడలోని మురళీ ఫార్య్చూన్ హోటల్లో సోమవారం జరిగింది. ఈ గ్రంథాన్ని చంద్రబాబు ఆవిష్కరించి మాట్లాడుతూ మారుమూల గ్రామమైన మంటాడలో పుట్టి ప్రపంచాన్నే మెప్పించి, ప్రపంచానికే సేవలందించిన దత్తాత్రేయుడు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆయన అదృష్టంతోపైకి రాలేదని, ప్రగాఢమైన సంకల్పంతో అంచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్లారని వివరించారు. ఎన్‌టిఆర్ ఇదే జిల్లాలో సాధారణ కుటుంబంలో పుట్టి ఇలాంటి వ్యక్తి మళ్లీ పుడుతారా అనే స్థాయికి వచ్చారంటే అదొక చరిత్ర అని పేర్కొన్నారు. ఒక్కోసారి ఒక్కొక్కరి జీవితం మలుపు తిరుగుతుందని, దాన్ని అందిపుచ్చుకుంటే ఏ స్థాయికైనా వెళ్తారని అన్నారు. దత్తాత్రేయుడు వైద్య రంగంలో ఎన్నో అవార్డులు పొందారని, వీటి కంటే వైద్యం చేయించుకున్న పేషెంట్ల నుంచి వచ్చిన అభినందనలే ఆయన పెద్ద అవార్డుగా భావిస్తారని పేర్కొన్నారు. దత్తాత్రేయుడుని కేన్సర్‌పై ప్రభుత్వ సలహాదారుగా తీసుకుంటున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఎమెస్కో బుక్ సెంటర్ అధినేత విజయకుమార్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.