బాలల్లో కేన్సర్‌పై అవగాహన అవసరం

– కెజిహెచ్‌ పిడియాట్రిక్‌ హెచ్‌ఒడి డాక్టర్‌ బిఎస్‌.చక్రవర్తి

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :బాలల్లో కేన్సర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కెజిహెచ్‌ పిడియాట్రిక్‌ హెచ్‌ఒడి డాక్టర్‌ బిఎస్‌.చక్రవర్తి అన్నారు. అంతర్జాతీయ బాల్య కేన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలోని మహాత్మా గాంధీ కేన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, శ్రేయ కేన్సర్‌ ఫౌండేషన్‌ సంయుక్తాధ్వర్యాన ఆదివారం ఎంవిపి కాలనీలోని మహాత్మా గాంధీ కేన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ కేన్సర్‌ను ఎదుర్కోవడం సామాన్యమైన విషయం కాదని, ఈ వ్యాధి ద్వారా వచ్చే సమస్యలను నిర్మూలించేందుకు ఒక్కసారి మందులు వాడితే సరిపోదని, తరుచూ పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కేన్సర్‌ వ్యాధిగ్రస్తులు ధైర్యంతోపాటు సానుకూల దృక్పథం కలిగి ఉండాలన్నారు. మహాత్మా గాంధీ కేన్సర్‌ హాస్పిటల్‌ ఎమ్‌డి డాక్టర్‌ మురళీకృష్ణ మాట్లాడుతూ.. తమ ఆస్పత్రిలో గత ఎనిమిదేళ్లలో 1,380 మంది పీడియాట్రిక్‌ రోగులకు చికిత్స చేశామని, 70 శాతం మందిలో కేన్సర్‌ను నివారించామని తెలిపారు. బాల్య కేన్సర్లలో రకాలను తెలియజేశారు. ప్రతి మూడు నిమిషాలకు ఒక పిల్లవాడు కేన్సర్‌తో మృతి చెందుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మ్యాజిక్‌ షో ఆకట్టుకుంది. విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ బాల స్టాలిన్‌ చౌదరి, డాక్టర్‌ ప్రవీణ వూన్న, డాక్టర్‌ రజనీ ప్రియ, డాక్టర్‌ కిషోర్‌ పాల్గొన్నారు.

➡️