చదువనే సంపదతో పిల్లలు ఎదగాలి : ‘జగనన్న విద్యా దీవెన’ నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం

  • చదువుల కోసం ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదు

ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. విద్యారంగంలో పెత్తందారులకు, పేదలకు మధ్య క్లాస్‌వార్‌ జరుగుతోందన్నారు. విద్యా రంగంలో మార్పులు తీసుకురాలేకపోతే కూలీల పిల్లలు కూలీలుగా, పేదల పిల్లలు పేదలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. పేద పిల్లల కోసమే జగన్నాథ రథం కదులుతోందన్నారు. కృష్ణా జిల్లా పామర్రులో ‘జగనన్న విద్యాదీవెన’ నిధులను శుక్రవారం సిఎం విడుదల చేశారు. రూ.708.68 కోట్ల నిధులను బటన్‌ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్‌ ఖాతాల్లోకి వేశారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ‘రాష్టంలో పెద్ద చదువులు చదువుతున్న 9,44,666 మంది విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు కడుతోంది. ఏ పేదవాడూ చదువుల కోసం అప్పులపాలు కాకూడదని మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్‌సిలతో పాటు మిగిలిన సామాజిక వర్గాల వారిని కూడా ఈ పథకానికి అర్హులుగా చేసేందుకు ఆదాయ పరిమితిని రూ.రెండు లక్షల వరకు పెంచాం. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలుగుతున్నాం’ అని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 57 నెలలుగా విద్యాదీవెన, వసతి దీవెన అందిస్తున్నామన్నారు. ఒక్క విద్యారంగంలో గత ఐదేళ్లలో రూ.73 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు. పేదరికం నుంచి బయటికి రావడానికి చదువొక్కటే అస్త్రమని నమ్మి మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నామన్నారు. తమ ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల విద్యావిధానంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండేలా పోటీ ప్రపంచంలో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించి ఒకటో తరగతి నుంచే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేశామన్నారు. ఇంగ్లీష్‌ మీడియంతో పాటు సిబిఎస్‌ఇ, ఐబి సిలబస్‌ తీసుకువచ్చామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరుగార్చారని, కార్పొరేట్‌ సంస్థలైన నారాయణ, చైతన్యలను పోషించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా మంత్రి జోగి రమేష్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

➡️