చలి పంజా – తెలుగు రాష్ట్రాలు గజగజ …!

అమరావతి : తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గత నెలరోజుల నుంచి తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఇంకా పడిపోతున్నాయి. ఈ ఏడాది గతం కంటే దారుణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పెరిగిపోయింది. ఎక్కడికక్కడ దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఇక ఏజెన్సీలో చెప్పనక్కరలేదు.. చలి దుప్పటి కప్పేస్తోంది. మంచు పొగ దట్టంగా మూసుకుపోతోంది.

అరకులోయలో చలి తీవ్రత మరింత పెరిగింది. పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు హెడ్‌ లైట్‌ లు వేసుకొని రాకపోకలు కొనసాగించారు. రాత్రి వేళల్లోనే కాదు పగటి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోతుండడంతో జనాలు ఇల్లా నుంచి బయటకు రావాలంటే గజగజ వణుకుతున్నారు. చలివణుకును తట్టుకునేందుకు ప్రజలు చలిమంటను ఆశ్రయిస్తున్నారు. విశాఖ ఏజెన్సీతోపాటు రాయలసీమ రీజియన్‌లోనూ చాలాచోట్ల 12 నుంచి 20 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలకు మించడం లేదు. మరోవైపు తెలంగాణలోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులోయలో 8.2 డిగ్రీలు, జి.మాడుగుల 9, డుంబ్రిగుడ 9.2, అనంతగిరి 9.5, జీకే వీధి 9.8, పాడేరు మండలం మినుములూరు 10, హుకుంపేట 10.5, చింతపల్లి 10.6, కొయ్యూరు 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి. ఇక…. తెలంగాణ ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 8.2 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. మెదక్‌లో 10, పటాన్‌ చెరులో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు, వఅద్ధులు, చిన్నారులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు, రైతులు, కార్మికులు, ఇతర పనులు చేసుకునేవారు సైతం బయటకు వెళ్లడానికి జంకుతున్నారు.

➡️