Bangalore Rave Party – ఏ2గా ఉన్న చిత్తూరు అరుణ్‌ కుమార్‌ అరెస్ట్‌

May 25,2024 12:01

బెంగళూరు : బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవ్‌ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు వాసు ముఖ్య అనుచరుడు, ఈ కేసులో ఏ2గా ఉన్న అరుణ్‌ కుమార్‌ను బెంగళూరు క్రైం బ్యాచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్‌ కుమార్‌ ఈ రేవ్‌ పార్టీలో ఏ2గా ఉన్నాడు. బర్త్‌ డే పార్టీ నిర్వహించిన వాసుకు అరుణ్‌ ముఖ్య అనుచరుడు. కాగా, అరుణ్‌ కుమార్‌ బెంగళూరులో ఉంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే, రేవ్‌ పార్టీలకు కూడా ప్లాన్‌ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, అరుణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా… బెంగళూరులోని బీఆర్‌ ఫామ్‌ హౌస్‌ యజమాని గోపాల్‌ రెడ్డికి కూడా సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. రేవ్‌ పార్టీపై పోలీసులు ఆకస్మిక దాడి చేసిన సమయంలో అక్కడ నుంచి పారిపోయిన పూర్ణారెడ్డి అనే వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. బెంగళూరు రేవ్‌ పార్టీకి వచ్చిన వారిలో 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ తీసుకున్న వారిలో టాలీవుడ్‌ నటి హేమా, ఆషీరారు కూడా ఉన్నారు. వీరి బ్లడ్‌ శాంపిల్స్‌లో డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఆనవాళ్లను గుర్తించిన సంగతి విదితమే. మిగతా వారి పేర్లను కూడా పోలీసులు ప్రకటించాల్సి ఉంది.

➡️