‘ఛలో సెక్రటేరియట్‌’ ఉద్రిక్తత – ఆంధ్రరత్న భవన్‌ వద్ద షర్మిల బైఠాయింపు

అమరావతి : మెగా డిఎస్‌సి ప్రకటించాలంటూ … గురువారం ఛలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో… ఆంధ్రరత్న భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెగా డి ఎస్‌ సి ఇవ్వాలని కోరుతూ … పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల గురువారం ఆంధ్రరత్న భవన్‌ వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీసీసీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయానికి వెళ్లే అన్ని రహదారుల వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి రాకపోకలు నిలిపేశారు. ఇప్పటికే పలుచోట్ల కాంగ్రెస్‌ నేతలను గృహ నిర్బంధం, ముందస్తు అరెస్టులు చేశారు. దీనిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకు ముందు షర్మిల మాట్లాడుతూ … పోలీసులు ప్రభుత్వ తీరును ఖండించారు. వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని ఎద్దేవా చేశారు. నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారనీ, ఇనుప కంచెలు వేసి తమను బందీలు చేశారని మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారని నిప్పులుచెరిగారు. ” మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే. ఇందుకు మీ చర్యలే నిదర్శనం ” అని అన్నారు. సిడబ్ల్యుసి సభ్యులు గిడుగు రుద్రరాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6 వేలకే నోటిఫికేషన్‌ ఇచ్చినందుకు వైసిపి సర్కార్‌ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని కోరారు.

➡️