మార్గదర్శిపై సిఐడి కేసులు వాపస్‌

Aug 29,2024 23:17 #Case, #CID, #Margadarsi

ప్రజాశక్తి-అమరావతి : మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆర్థిక అవకతవకలు, ఇతర ఉల్లంఘనలు జరిగాయంటూ రామోజీరావు, శైలజా కిరణ్‌, మార్గదర్శికి చెందిన ప్రముఖలు, ఉద్యోగులపై కేసుల ఆధారంగా దాఖలు చేసిన చార్జిషీట్లను సిఐడి వాపస్‌ తీసుకుంది. గుంటూరు, విశాఖపట్నంలలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్‌’ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేసిన అప్పీళ్లను కూడా ఉపసంహరించుకుంది. సిఐడి అదనపు డిజి లేఖ ఆధారంగా అప్పీళ్లను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎం లక్ష్మీనారాయణ గురువారం హైకోర్టుకు తెలియజేశారు. వీటిని రికార్డుల్లో నమోదు చేసి ఈ వ్యవహారం పరిష్కారమైనట్లుగా జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఆదేశాలు జారీ చేశారు. చార్జిషీట్లను రిటర్న్‌ చేస్తూ ప్రత్యేక కోర్టుల ఉత్తర్వులను హైకోర్టులో సిఐడి అప్పీల్‌ పిటిషన్లు వేసింది. ఇవి విచారణకు వచ్చిన సందర్భంగా కేసులను ఉపసంహరించుకున్నట్లు సిఐడి చెప్పడంతో అందుకు హైకోర్టు అనుమతినిచ్చింది.

పర్యాటకాభివృద్ధి సంస్థ తీరుపై హైకోర్టు ఆగ్రహం
తిరుమలలో క్యాంటీన్లను నిర్వహించకుండా సబ్‌ లీజుకు ఎందుకు ఇచ్చారని పర్యాటకాభివృద్ధి సంస్థను హైకోర్టు ప్రశ్నించింది. తిరుమలలో క్యాంటీన్‌ నిర్వహణకు టిటిడి అనుమతులిస్తే, ఆ క్యాంటీన్‌ను మరొకరికి సబ్‌ లీజుకు ఇవ్వడానికి ఎపిటిడిసి టెండర్లు పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని ఎపిటిడిసిని ఆదేశించింది. విచారణను సెప్టెంబరు 4కు వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తిరుమలలో క్యాంటీన్‌ నడుపుకునేందుకు టిటిడి నుంచి అనుమతి పొందిన ఎపిటిడిపి ఆ తర్వాత సబ్‌ లీజుకు టెండర్లు పిలవడాన్ని హైదరాబాద్‌కు చెందిన సురవరం ప్రతాప్‌రెడ్డి పిల్‌ దాఖలు చేశారు. సబ్‌ లీజ్‌కు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని న్యాయవాది పిఆర్‌కె అమరేంద్ర కుమార్‌ తెలిపారు.

➡️