- సిఐడి విచారణతో నెలకొన్న ఉత్కంఠ
- రెండో రోజూ కొనసాగిన విచారణ
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ (అన్నమయ్య జిల్లా) : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనం కేసును సిఐడి అధికారులు వేగవంతం చేశారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో సిఐడి డిఎస్‌పి వేణుగోపాల్, ఎస్‌ఐ వెంకట రమణ రెండవ రోజు మంగళవారం విచారణ కొనసాగించారు. సబ్ కలెక్టరేట్ సిబ్బందిని ఒక్కొక్కరినే పిలిచి విచారిస్తున్నారు. రాత పూర్వకంగా స్టేట్‌మెంట్లు తీసుకుంటున్నారు. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్‌పి విద్యాసాగర్ నాయుడు, అడిషనల్ ఎస్‌పి రాజ్ కమల్, సిఐడి డిఎస్‌పి వేణుగోపాల్, మదనపల్లె డిఎస్‌పి కొండయ్య నాయుడు సబ్ కలెక్టరేట్లో దగ్ధమైన రికార్డులను సోమవారం రాత్రి పరిశీలించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొందరి అధికారులను అదుపులోకి తీసుకోగా.. ఈ కేసులో ప్రమేయమున్న మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిపై కేసులు నమోదు కాగా ఎవరినీ అరెస్టు చేయకపోవడం కొసమెరుపు. అసలు నేరస్తులు ఎవరన్న దానిపైన సిఐడి అధికారులు దృష్టి సారించారు. సిఐడి డిఎస్‌పి వేణుగోపాల్ మాట్లాడుతూ మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో జరిగిన ఫైళ్ల దగ్ధం కేసులో కార్యాలయ సిబ్బందితో స్టేట్మెంట్‌ను రీ వెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో స్థానిక పోలీసులు తీసుకున్న స్టేట్‌మెంట్ సిబ్బంది ఇచ్చినదేనా? అని మరోసారి నిర్ధారణ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో బాధ్యులపై చర్యలు ఉంటాయని తెలిపారు.