- భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గంగాధర్
- సిఐఐ ఎపి నూతన్ చైర్మన్‌గా మురళీకృష్ణ
ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : స్టేట్ కౌన్సిల్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సిఐఐ) సభ్యులు, ప్రతినిధులు, బ్రిక్స్, జి7, జి20 వంటి బహుళ మార్గాలతో భాగస్వామ్యం ద్వారా భారత దేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించేందుకు కృషి చేస్తున్నారని భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక దౌత్య సంయుక్త కార్యదర్శి పిఎస్.గంగాధర్ తెలిపారు. సిఐఐ 2024-25 వార్షిక సమావేశం గురువారం విశాఖలోని నోవాటెల్ హోటల్ వేదికగా నిర్వహించారు. ఈ సమావేశాన్ని పురస్కరించుకొని ‘స్వర్ణ ఆంధ్రప్రదేశ్ – విజన్ 2047’పై ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన గంగాధర్ మాట్లాడుతూ.. తూర్పు కారిడార్‌లో వాణిజ్యాన్ని పెంపొందించడంలో రాష్ట్రానికి ఉన్న వ్యూహాత్మక ప్రయోజనాన్ని వివరించారు. ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల మధ్యవర్తిత్వం వంటి రంగాల్లో పారిశ్రామికవేత్తలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఎంఎస్‌ఎంఇ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర విజన్ అభివృద్ధికి సిఐఐ, పారిశ్రామిక భాగస్వాముల సహకార ప్రయత్నాలను అభినందించారు. సిఐఐ ఇండియా కౌన్సిల్ చైర్మన్ రాజన్ నవానీ మాట్లాడుతూ.. యువత శక్తి, నూతన ఆవిష్కరణలు, వివిధ రంగాల్లో పురోగతికి దారితీస్తున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు వంటి వాటిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్, తూర్పు నౌకాదళ కమాండ్ రియర్ అడ్మిరల్ ఆర్‌ఎస్ ధలివాల్, సిఐఐ ఎపి మాజీ చైర్మన్ సురేష్‌రాయుడు చిట్టూరి, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కమిటీ ఎన్నిక
అనంతరం 2025-26 సంవత్సరానికి కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. ఫ్లూయెంట్‌గ్రిడ్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సిఇఒ మురళీకృష్ణ గన్నమణిని చైర్మన్‌గా, అపెక్స్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.నరేంద్రకుమార్ వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి.మురళీకృష్ణ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.