- ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారంలో కీలకమైన సిఐఎస్‌ఎఫ్‌కు చెందిన 438 మంది సిబ్బందిని తొలగించడం సరికాదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ, నాయకులు శ్రీనివాసరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 1454వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్ ఎల్‌ఎంఎం, ఎంఎంఎస్‌ఎం, ఎస్‌టిఎం విభాగాలకు చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూఉక్కు కర్మాగార విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా ద్వంద వైఖరి అవలంబిస్తోందని అన్నారు. ఇప్పటికే ఉక్కు ఉద్యోగుల తొలగింపులో భాగంగా విఆర్‌ఎస్‌ను ప్రకటించిందని అన్నారు. తాజాగా ఉక్కులో సిఐఎస్‌ఎఫ్ సిబ్బందిని తొలగించడం దారుణమన్నారు. సిఐఎస్‌ఎఫ్ వద్ద అధునాతన ఆయుధాలు ఉంటాయని, ప్లాంట్‌ను రక్షించడంలో వారి పాత్ర కీలకమని, ఈ నేపథ్యంలో తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉక్కు ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోయినా వారంతా అంకిత భావంతో ఉత్పత్తిలో నిమగమైన విషయాన్ని గుర్తుచేశారు. కర్మాగారం అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు జీతాలు సకాలంలో చెల్లించకుండా పర్సంటేజీల రూపంలో చెల్లిస్తుండడం దుర్మార్గమన్నారు. దీక్షల్లో నాయకులు డి దేముడు, ఎం త్రినాధ్, జి ఆనంద్, ఎంకెవి రాజేశ్వర్‌రావు, నంబారు సింహాద్రి, దాసరి శ్రీనివాస్ పాల్గొన్నారు.