- ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్ : గ్రంథాలయాల పునరుజ్జీవనానికి పౌరులు ఉద్యమించాలని, తెలుగువారిలో భాషా సాంస్కృతి చైతన్యాన్ని పునరుజ్జీవింపజేయడానికి గ్రంథాలయ ఉద్యమం తప్పనిసరి అని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. 35వ విజయవాడ పుస్తక మహోత్సవం ఎనిమిదో రోజు గురువారం రామోజీరావు సాహితీ వేదికపై గ్రంథాలయ పునర్వికాస సదస్సు నిర్వహించారు. ప్రధాన వక్తగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు జాతి చైతన్యానికి, తెలుగు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికీ గ్రంథాలయ ఉద్యమమే కారణమని చెప్పారు. పిల్లలలో పఠనాసక్తిని పెంపొందింపజేసే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. నేటి తరం పిల్లలు తెలుగు చదవలేకపోవడం విషాదకరమన్నారు. దేవాలయాల వ్యవస్థకు, గ్రంథాలయ వ్యవస్థకు ప్రభుత్వాలు న్యాయం చేయలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. గ్రంథాలయాలకు స్వయం సమృద్ధి కల్పించేందుకు చదువరులు ఉద్యమించాలనీ. ప్రభుత్వాలను నిలదీయాలనీ ఆకాంక్షించారు. కొత్త రాష్ట్రంలో జాతికి గర్వకారణమయ్యే రాష్ట్ర కేంద్ర గ్రంథాలయానికి నూతన భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సభకు ఎస్. వెంకటనారాయణ అధ్యక్షత వహించగా సాహిత్య అకాడమీ సభ్యులు ఎమెస్కో విజయకుమార్, వికీపీడియా కార్యకర్త రహమాన్, క్రియేటివ్ కామన్స్ శ్రీపతి, మనసు ఫౌండేషన్ బాధ్యులు మన్నెం రాయుడు, విశాలాంధ్ర మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
సమాజం యొక్క అరసికత మీద చలం అనుక్షణం పోరాడాడని ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి అన్నారు. రామోజీరావు సాహితీ వేదికపై జరగిన గుడిపాటి వెంకటా చలం రచించిన ‘అమీనా’, ‘వివాహం’, ‘అరుణ’, ‘దైవమిచ్చిన భార్య’ నవలలను ఆమె ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన డా. వావిలాల సుబ్బారావు మాట్లాడుతూ.. సమాజానికి చలం రచనలు ఎప్పటికీ అవసరమేనన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, రచయిత్రి గోటేటి లలితాశేఖర్ సభలో పాల్గొన్నారు.