సిఐటియు బలోపేతమే పర్సకు నిజమైన నివాళి

  • సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎ.గఫూర్‌
  • కర్నూలు, పుట్టపర్తిల్లో శత జయంతి ఉత్సవాలు

ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్‌, పుట్టపర్తి అర్బన్‌ (శ్రీసత్యసాయి జిల్లా) : సిఐటియును బలోపేతం చేయడమే కార్మికోద్యమ నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పర్సా సత్యనారాయణకు మనం ఇచ్చే ఘనమైన నివాళని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎ.గఫూర్‌ అన్నారు. పర్స సత్యనారాయణ శత జయంతి ఉత్సవాలు కర్నూలులోనూ, శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోనూ సోమవారం జరిగాయి. ముందుగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కర్నూలులోని కార్మిక, కర్షక భవన్‌లో సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్‌ రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఉత్సవాల్లో ఎంఎ.గపూర్‌ మాట్లాడుతూ పర్సా సత్యనారాయణ, నండూరి ప్రసాదరావు కలిసి సిఐటియు నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. సింగరేణి కాలరీస్‌లో కార్మిక సంఘాన్ని పర్స సత్యనారాయణ ఎంతో కష్టపడి నిర్మించారని వివరించారు. అనేక కష్టాలు ఎదుర్కొన్నారని, అనేక సంవత్సరాల పాటు అజ్ఞాత జీవితం గడపాల్సి వచ్చిందని, తొమ్మిదేళ్లపాటు జైలు జీవితం అనుభవించారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు కోసం శాసనసభ సభ్యత్వాన్ని త్యాగం చేసిన ఘనత పర్సాకే దక్కుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సిఐటియు అధ్యక్షులుగా, గౌరవాధ్యక్షుడిగా, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులుగా, కార్మికలోకం సంపాదకులుగా అనేక సంవత్సరాలు పర్సా పనిచేశారని తెలిపారు. మన రాష్ట్రంలో సిఐటియు ఉద్యమం విస్తరించడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం అతిథి గృహంలో శ్రామిక మహిళ సమైక్య అధ్యక్షురాలు దిల్షాద్‌ అధ్యక్షతన పర్స సత్యనారాయణ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ జీవిత కాలం కార్మికుల సంక్షేమం, కార్మిక హక్కుల కోసం ఉద్యమాలు నడిపిన ఉద్యమ సారథి పర్స సత్యనారాయణ అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. సామ్రాజ్యవాదులకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా వర్గపోరాటాలు నిర్వహించారని వివరించారు. పర్సా లాంటి ఎందరో కార్మిక నేతల పోరాట ఫలితంగా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను పదేళ్లుగా దేశాన్ని పాలించిన బిజెపి ప్రభుత్వం హరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు. పర్స ఉద్యమ స్ఫూర్తితో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ హక్కుల కోసం ఉద్యమించాలని కోరారు.

➡️