పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ను పున:ప్రారంభించాల్సిందే : సిఐటియు

ప్రజాశక్తి -ముత్తుకూరు : కృష్ణపట్నం పోర్టులో కంటైనర్‌ టెర్మినల్‌ను పున:ప్రారంభించాల్సిందేనని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె అజరుకుమార్‌ డిమాండ్‌ చేశారు. పోర్టు టెర్మినల్‌ను ప్రారంభించాలని కోరుతూ ఇటీవల సిఐటియు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో జాతా చేపట్టారు. జాతా ముగింపు సందర్భంగా ముత్తుకూరు బస్టాండ్‌ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అజరు కుమార్‌ మాట్లాడుతూ.. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్‌ టెర్మినల్‌ను మరో ప్రాంతానికి తరలించడం వల్ల పోర్టులో ఆర్థిక కార్యకలాపాలు తగ్గాయన్నారు. ఫలితంగా కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే పోర్టు టెర్మినల్‌ను పున:ప్రారంభించి పోర్టు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టిడిసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కంటైనర్‌ టెర్మినల్‌ను ప్రారంభించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్‌ మాట్లాడుతూ.. కంటైనర్‌ టెర్మినల్‌ యధావిధిగా కృష్ణపట్నంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కఅష్ణపట్నం పారిశ్రామిక క్లస్టర్‌ అధ్యక్షులు నక్క రాదయ్య, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, ఆటో యూనియన్‌ నాయకులు పాల్గన్నారు.

➡️