- ఆవిర్భావ దినోత్సవంలో సిహెచ్ నర్సింగ్‌రావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో/ కాకినాడ : దేశంలో వర్గపోరాట సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సమరశీల పోరాటాలకు కేంద్ర బిందువు సిఐటియు అని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగ్‌రావు తెలిపారు. విజయవాడలోని సిఐటియు రాష్ట్ర కార్యాలయం ఎదుట గురువారం సిఐటియు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. సిఐటియు సీనియర్ నాయకులు ఆర్‌వి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిహెచ్ నరసింగ్‌రావు సిఐటియు జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. ఐక్యత-పోరాటం నినాదంతో సిఐటియు ఏర్పడిందని తెలిపారు. సిఐటియు కార్మిక హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించిందన్నారు. కార్మిక ఐక్యతతో దేశవ్యాప్తంగా రైల్వే సమ్మెతో ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసిందన్నారు. దేశంలో సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా 1991 నుంచి సమరశీల పోరాటాలను నడిపించడంలో సిఐటియు ముందున్నదని తెలిపారు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు కార్మికులు సమాయత్తం కావాలని కోరారు. దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లను ఐక్యపరచి వారి హక్కుల కోసం ఉద్యమించాలన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణతోపాటు మతోన్మాద విధానాన్ని అవలంభిస్తున్న బిజెపిని చిత్తుచేయాలన్నారు.