CITU: రాజకీయ వేధింపులపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం

స్కీం వర్కర్ల ధర్నాలో కందారపు మురళి
ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట సోమవారం స్కీం వర్కర్లు ధర్నా చేశారు. ఈ వేధింపుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌ చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ జిల్లాలోని34 మండలాల్లో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు రోజురోజుకూ తీవ్రతరం అయ్యాయని, అధికార టిడిపి నాయకులు గ్రామస్థాయి నుంచి ఈ వేధింపులకు పాల్పడుతూ మహిళలను విచక్షణ మరచి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌పై టిడిపి నాయకుడు పి ఈశ్వర్‌ రెడ్డి దాడి చేసి, లైంగిక వేధింపులకు గురిచేశారని, పైగా ఆమెపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా రాజీనామా చేయాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు. వెంకటగిరి మండలం సుబ్రహ్మణ్యం గ్రామంలో ఆశా వర్కర్‌ కస్తూరి కృష్ణవేణి ఒంటరి మహిళ అనిస్థానిక గ్రామ పెత్తందారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రమణ్యం, కోశాధికారి కెఎన్‌ఎన్‌ ప్రసాదరావు మాట్లాడుతూ తక్షణం మహిళలకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య, జయచంద్ర, కార్యదర్శి ఆర్‌. లక్ష్మి, టి. సుబ్రమణ్యం, ఆర్‌ వెంకటేశ్‌, గురవయ్య, వడ్డిపల్లి చెంగయ్య, కె వేణుగోపాల్‌, మాధవ్‌, మునిరాజ, బుజ్జి, రాజేశ్వరి, ధనమ్మ, మురగేశు తదితరులు ప్రసంగించారు.
వేధింపులను సహించం: కలెక్టర్‌ వెంకటేశ్వర్‌
ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌కు సిఐటియు నేతలు, బాధితులు వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన కలెక్టర్‌ గ్రామాలలో చిరుద్యోగులపై వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామీణ, మండల స్థాయిలో అధికారులకుగానీ, పార్టీ నాయకులకుగానీ ఉద్యోగులను తొలగించే అధికారం లేదని వివరించారు. సమస్యలు ఏమున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

➡️