కార్మిక వర్గంపై ప్రభుత్వాలు దాడి

Dec 18,2023 08:13 #CITU, #Seminar, #workers
citu seminar on attack on working class

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టాక కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని, సామాన్య ప్రజలపై భారాలు మోపుతోందని సిఐటియ రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు అన్నారు. సిఐటియు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ శతజయంతి సందర్భంగా ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు-ఉద్యోగులు, కార్మికులపై ప్రభావం’ అనే అంశంపై గుంటూరులోని ఎన్‌జిఒ హోంలో ఆదివారం రాష్ట్ర స్థాయి సెమినార్‌ నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీణారాయణ అధ్యక్షతన జరిగిన సెమినార్‌లో ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మోడీ పాలనలో ప్రతి కుటుంబంపై విద్యుత్‌, గ్యాస్‌, పెట్రోలు, నిత్యావసర సరుకుల భారం ఏడాదికి దాదాపు రూ.60 వేలు పెరిగిందన్నారు. మరోవైపు కార్మికులకు కనీస వేతనాలు అమలు కావట్లేదన్నారు. పెరిగిన ధరలతో కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ పథకాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీలు, ఆశాలు, ఇతర స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనాలు అమలు కావట్లేదని, హక్కులు లేకుండా వెట్టిచాకిరీ చేస్తున్నారన్నారు. ఎల్‌ఐసి, బ్యాంకులు, గనులు, రైల్వేలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని తెలిపారు. కార్మిక చట్టాలు రద్దు చేసి, కార్పొరేట్లకు అనుకూలంగా 4 లేబర్‌ కోడ్‌లు తెచ్చిందన్నారు. మరోవైపు రాష్ట్రం ప్రభుత్వం కేంద్రం బాటలోనే నడుస్తూ ప్రజలపై భారాలు మోపుతోందని తెలిపారు. ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. సెమినార్‌లో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం మచిలీపట్నం డివిజన్‌ జాయింట్‌ సెక్రెటరీ వివికె.సురేష్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి, ఎపిఎన్‌జిఒ నగర నాయకులు మూర్తి తదితరులు ప్రసంగించారు. తొలుత పర్సా సత్యనారాయణ, ఎమ్మెల్సీ సాబ్జి చిత్రపటాలకు యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు విశ్వనాథం, సిఐటియు నాయకులు హుస్సేన్‌వలి పూలమాల వేసి నివాళి అర్పించారు.

➡️