స్కీమ్‌ కార్మికుల తొలగింపులు ఆపాలి : సిఐటియు

Jul 5,2024 20:32 #CITU, #Layoffs, #scheme workers, #Stopped
నేడు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో స్కీమ్‌ కార్మికుల తొలగింపులు ఆపాలని సిఐటియు రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు ఆ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్‌ నర్సింగరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో పరిష్కారం కాని సమస్యలను కొత్త ప్రభుత్వం పరిష్కరిస్తుందని అంగన్‌వాడీలు, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్‌ కార్మికులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ కింది స్థాయి నాయకులు స్థానికంగా పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లను పని మానేయాలని బెదిరిస్తున్నారని, తద్వారా వారి మనుషులను పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో ఒక అంగన్‌వాడీ వర్కర్‌ ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని వివరించారు. ఇదే జిల్లాలో మరో రెండు చోట్ల హెల్పర్లను బయటకు పంపి తమ వారిని పనిలో పెట్టుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారని తెలిపారు. అనంతపురం జిల్లా వజ్రకరూరులో కూడా మధ్యాహ్న భోజన కార్మికురాలిపై స్థానిక అధికార పార్టీ నాయకులు దాడి చేశారని వివరించారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక పురుగుమందు తాగి ఆమె చావుబతుకుల్లో ఉందని తెలిపారు. ఇతర కార్మికులపై కూడా ఒత్తిడి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీలు మారినప్పుడల్లా కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినవారు స్కీమ్‌ వర్కర్లపై దాడి చేయడం ఒక రివాజుగా మారిందని విమర్శించారు. వర్కర్ల పని పరిస్థితులకు సంబంధించి కొన్ని విధి విధానాలున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️