ప్రజాశక్తి-కాకినాడ : క్లాప్ వాహన డ్రైవర్ల మూడు నెలల బకాయి జీతాలు చెల్లించాలని చేస్తున్న ఆందోళన ఏడవ రోజుకు చేరుకుంది. గురువారం క్లాప్ డ్రైవర్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర్లను కలిసి బకాయి జీతాల, ఇతర సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక వెంకటరమణ సిటీ ఎమ్మెల్యే తో మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి జీతాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగా 9 నెలల నుంచి పిఎఫ్ కట్ చేసుకుని కాంట్రాక్టర్ కార్మికుల ఖాతాకు జమ చేయట్లేదని ఈ విషయాలపై ప్రజాప్రతినిది గా పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కి ఫోన్ చేసి క్లాప్ వాహన డ్రైవర్ల జీతాల విషయం ఎంతవరకు వచ్చిందని తెలుసుకుని తక్షణమే జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో క్లాప్ వాహన డ్రైవర్ల జీతాల సమస్యను లేవనెత్తి పరిష్కారం అయ్యేలాగా చూస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో ముందుంటుందని అంతేకాకుండా కార్మికుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం తమదని అన్నారు. కార్మికుల సమస్యల పట్ల ఎమ్మెల్యే కొండబాబు సానుకూలంగా మాట్లాడినందుకు కార్మికులందరూ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లాప్ వాహన డ్రైవర్స్ యూనియన్ నాయకులు సంతోష్, ఇస్మాయిల్, విక్టర్, భైరవ స్వామి, కొండబాబు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.