కేంద్రాన్ని మొదటి విడతగా రూ.6,880 కోట్లు అడిగాం : సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి-విజయవాడ : కేంద్రాన్ని మొదటి విడతగా రూ.6,880 కోట్లు అడిగామని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో ఏడు రోజు పర్యటన అనంతరం విజయవాడ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఐదేళ్లుగా పులిచింతల, గుండ్లకమ్మ గేట్లను పట్టించుకోలేదని.. బుడమేరును ఇష్టా రాజ్యంగా కబ్జా చేశారని తెలిపారు. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటుకున్నట్లు తెలిపారు. విజయవాడలో భారీ వర్షానికి నీళ్లు పెరిగాయని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం మళ్లీ పెరుగుతోందని.. ఆదివారం కూడా వర్షాలు పడతాయని సమాచారం ఉందన్నారు. అందరికీ ఆహారం, మంచినీరు అందించాం. నిన్న, ఇవాళ 66 వేల మందికి ఆహారం అందించాం. పాలు, పండ్లు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇవాళ రాయితీ ధరపై 64 టన్నుల కూరగాయలు విక్రయించాని.. వరద ప్రాంతాల్లోని రోడ్లను 78శాతం శుభ్రం చేశామని తెలిపారు. వరదనీరు ఉన్న ప్రాంతాలకు మినహా మిగిలిన అన్ని ఏరియాలకు విద్యుత్‌ సరఫరా జరగుతోందన్నారు. ఫైర్‌ సిబ్బంది ఇప్పటి వరకు 17వేల ఇళ్లు శుభ్రం చేశారని తెలిపారు.

➡️