ప్రజలకు సిఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : మాజీ మంత్రి వెలంపల్లి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తిరుమల లడ్డూ ప్రసాదంపై సిఎం చంద్రబాబు చేసిన ప్రచారంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా వాస్తవాలను ప్రజల ముందు వుంచుతూ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ కల్తీ జరిగిందని ఎలాంటి ఆధారాల్లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో వున్న చంద్రబాబు మాట్లాడటం సరైంది కాదన్నారు. దేవుడిని రాజకీయంలోకి లాగొద్దంటూ సుప్రీంకోర్టు చురకలంటించిందని తెలిపారు. కేసు పెట్టకుండా, విచారణ చేయకుండా మాట్లాడటం తగదని అన్నారు. మాజీ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన అంశాలనే సుప్రీంకోర్టు ధ్రువీకరించిందన్నారు. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు స్పందించిన తీరును ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు కనుసైగల్లో ఉండే సిట్‌ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, విచారణను కూడా సుప్రీంకోర్టు చేయాలని కోరారు.

➡️