- మృతులకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
- చంద్రబాబు ప్రకటన శ్రీ అధికారులపై ఆగ్రహం
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : ఆరుగురి మరణానికి దారి తీసిన తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం మధ్యాహ్నం 1.30కు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన కారులో నేరుగా బైరాగిపట్టెడ కేంద్రానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడనుంచి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. టిటిడి పరిపాలనా భవనంలో ప్రభుత్వ, టిటిడి ఉన్నతాధి కారులతో రెండు గంటలపాటు సమావేశమై ఘటన జరిగిన తీరుతెన్నులను, భవి ష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనపై న్యాయవిచారణ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధా కరమైన ఘటన ఇది.. పవిత్రమైన దివ్యక్షేత్రంలో ఇలాంటివి జరగకూడదు.’ అని ఆయన చెప్పారు. ఆరుగురు చనిపోవడం తన మనస్సును కలిచివేసినట్లు చంద్రబాబు తెలిపారు ‘రాత్రంతా బాధపడ్డా’ అని చెప్పారు. మృతుల కుటుంబాలు ఆరుగురికి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలను టిటిడి తరపున ఆర్థిక సాయం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ ఆరుగురు కుటుంబాల్లోని వారికి తిరుమలలో గాని, వారు నివాసం ఉండే ప్రాంతాల్లో గాని టిటిడి అనుబంధ ఆలయాల్లో కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ ఘటనలో 35 మంది గాయపడితే ఈశ్వరమ్మ అనే ఇద్దరి మహిళల పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిపారు. వారి ఆరోగ్యం క్రమేణా మెరుగుపడు తున్నట్లు చెప్పారు. వీరిద్దరికి ఐదు లక్షల రూపాయల వంతున ఆర్థికసాయం అందిస్తామని మిగిలిన 33 మందికి రూ.రెండు లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా గాయపడిన వారికి ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్నారు. టిటిడి సొంత వాహనాల్లోనే వారి ఇళ్లకు చేరుస్తామన్నారు.’ నేను భక్తునిగా,సిఎంగా చెబుతున్నా.. తిరుమల పవిత్రతను కాపాడాలి’ అని ఆయన అన్నారు. దేవుని దగ్గర సేవ ముఖ్యమని అన్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయమని చెప్పారు. ‘వైకుంఠ ద్వార దర్శనాన్ని పది రోజులకు పెంచారు. ఎందుకు పెంచారో తెలియదు. మొదటి నుండి ఉన్న సంప్రదాయాలను మార్చడం మంచిది కాదు.ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్దతులు ఉండాలి’ అని సిఎం అన్నారు. ‘పవిత్ర దినాల్లో దర్శనాల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూసే బాధ్యత అధికారులదే’ అని ఆయన స్పష్టంచేశారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మకాయల రామానాయుడు, అనిత, పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు పాల్గొన్నారు.