TTD: టిటిడిలోని అన్యమతస్తులను బదిలీ చేస్తాం

ముంతాజ్‌ హోటల్‌, ఎఎంఆర్‌, దేవలోక్‌ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు రద్దు
దేశంలోని అన్ని రాజధానుల్లోనూ శ్రీవారి ఆలయాలు : ముఖ్యమంత్రి చంద్రబాబు
మాతృశ్రీ అన్నదానం భవనంలో యాత్రికులకు స్వయంగా వడ్డన
ప్రజాశక్తి- తిరుమల : టిటిడిలో పనిచేస్తోన్న అన్యమతస్తులను బదిలీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వారికి మరోచోట అవకాశం కల్పిస్తా మన్నారు. ఎవరి మత సంస్థల్లో వారే పనిచేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలిపిరి సమీపంలోని ముంతాజ్‌ హోటల్‌, ఎఎంఆర్‌, దేవలోక్‌ ప్రాజెక్టులకు కేటాయించిన భూములను రద్దు చేస్తు న్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని రాజధానుల్లోనూ శ్రీవేంకటేశ్వర ఆలయాలను టిటిడి ఆధ్వర్యాన నిర్మిస్తామన్నారు. ప్రపంచంలో హిందువులు ఎక్కువగా ఉన్న దేశాల్లోనూ ఈ ఆలయాల నిర్మాణం చేపడతామని చెప్పారు. తన మనవడు నారా దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కుటుంబసమేతంగా దర్శించు కున్నారు. తిరుమలకు శుక్రవారం వచ్చిన యాత్రి కులకు అన్నదానం కోసం అయిన ఖర్చు రూ44 లక్షలను ఆయన భరించారు. మాతృశ్రీ అన్నదానం భవనంలో యాత్రికులకు నేరుగా చంద్రబాబు వడ్డించారు. కుటుంబ సమేతంగా ఆయన అక్కడే భోజనం చేశారు. అనంతరం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవని అన్నారు. శ్రీవారి సేవను మరింత పకడ్బందీగా అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. అమరావతిలో శ్రీనివాస కల్యాణోత్సవం ద్వారా నూతనోత్సాహం, నమ్మకం పెరిగిందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో రాజధాని అమరావతిని పున్ణనిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. టిటిడిలో ఎలాంటి వ్యాపారాత్మక నిర్మాణాలు చేపట్టరాదన్నారు. శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు  ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. అన్నదానం చేస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిదన్నారు. తిరుమలతో అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి.రామారావు ప్రారంభించారని గుర్తు చేశారు. ఎస్‌వి అన్నదానం ట్రస్ట్‌కు రూ.2,200 కోట్లు కార్పస్‌ ఫండ్‌ విరాళంగా వచ్చిందని తెలిపారు. దేశ, విదేశాల్లోని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలలోని ఏడుకొండలు శ్రీవారి సొంతమన్నారు. తిరుమలలో అపవిత్ర కార్యకలాపాలు నిర్వహించడం, వ్యాపార ధోరణితో చూడడం తగదని అన్నారు. విలేకర్ల సమావేశంలో టిటిడి చైర్మన్‌ బిఆర్‌ నాయుడు, ఇఒ జె.శ్యామలరావు, అడిషనల్‌ ఇఒ సిహెచ్‌ వెంకయ్యచౌదరి పాల్గొన్నారు. అనంతరం రెండు రోజుల పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన చంద్రబాబుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సాదర వీడ్కోలు పలికారు. వారిలో టిటిడి ఇఒ శ్యామలరావు, డిఐజి షిమోషి బాజ్పారు, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌, తిరుపతి జిల్లా ఎస్‌పి హర్షవర్థన్‌ రాజు, జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, భాను ప్రకాష్‌, కోనేటి ఆదిమూలం, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌ మౌర్య తదితరులు ఉన్నారు.

➡️