బిపిసిఎల్‌తో భారీ పెట్టుబడులు

Jul 10,2024 23:55 #ap cm chandrababu, #BPCL, #meeting, #Members
  • కంపెనీ ప్రతినిధులతో సిఎం భేటీ
  • అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ
  • 5వేల ఎకరాలు ఇవ్వడానికి సుముఖత

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బిపిసిఎల్‌) రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆ సంస్థ ఛైర్మన్‌, ఎండి కృష్ణకుమార్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ఆయన సచివాలయంలో బుధవారం సమావేశమ య్యారు. రాష్ట్రంలో చమురు శుద్ది కర్మాగారం, పెట్రో కెమికల్‌ కారిడార్‌ ఏర్పాటుకు సంబంధించి వారితో చర్చించారు. అనంతరం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించిన చంద్రబాబు చర్చలు సాకారమైతే 60 వేల కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతంగా నిలుస్తుందని పేర్కొన్నారు. టీవల కేంద్ర మంత్రులను కలిసి తమరాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో బిపిసిఎల్‌ ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి సిఎంను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంస్థ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను 90 రోజుల్లో సమర్పించాలని వారికి సూచించారు. ఆ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పెట్రో కెమికల్‌, రీ ఫైనరీ ఏర్పాటుకు తమకు కనీసం 4నుండి 5వేల ఎకరాల భూమి అవసరమౌతుందని కంపెనీ ప్రతినిధులు సిఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. సముద్రతీరంలో గణనీయంగా పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయని, వెంటనే కంపెనీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్స్‌ వేదికలో ఇదే విషయాన్న పేర్కొన్న సిఎం పెట్రో కెమికల్‌ కారిడార్‌ ఏర్పాటులో ఇది తొలి అడుగని తెలిపారు. చర్చల అనంతరం బందరు ఎంపి వల్లభనేని బాలశౌరి మీడియాతో మాట్లాడారు. బందరు పరిధిలో ఏర్పాటు చేసే సదుపాయాలకు సంబంధించిన అంశాలు కంపెనీకి వివరించామని, వారు కూడా త్వరలోనే డిపిఆర్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఇచ్చిన హామీల్లో పెట్రోలియం రిఫైనరీ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని స్పష్టంగా పేర్కొన్నారని, దాని మేరకు కేంద్రం కూడా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇక్కడ రిఫైనరీ వస్తే రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 25 వేలమందికి ఉపాధి దొరుతుందని తెలిపారు. అంతకుముందు మచిలీపట్నం ఎంపి బాలశౌరి, బిపిసిఎల్‌ ఎమ్‌డి కృష్ణకుమార్‌, బోర్డు సభ్యులు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
సిఎంను కలిసిన విన్‌ఫాస్ట్‌ ప్రతినిధులు
వియత్నాంకు చెందిన ఆటోమొబైల్‌ రంగ సంస్థ విన్‌ఫాస్ట్‌ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలిశారు. ఈ సంస్థ ఎలక్ట్రిక్‌ బ్యాటరీలు, వాహనాలు తయారు చేయడంలో పేరుగాంచింది. సంస్థ సిఇఓ ఫామ్‌ సాన్‌చౌ తన ఆహ్వానం మేరకు వచ్చారని సిఎం ఎక్స్‌ వేదికగా తెలిపారు. అలాగే సంస్థ ఏర్పాటుకు అవసరమైన భూములను పరిశీలించాలని పరిశ్రమలశాఖను సిఎం ఆదేశించారు.

➡️