ప్రజాశక్తి-పాలకొల్లు : కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ సిఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు కాపు, బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరరామ జోగయ్య లేఖ రాశారు. ఈ మేరకు లేఖ వివరాలను జోగయ్య స్వగృహం వద్ద మీడియాతో మాట్లాడారు. కాపులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని బ్రిటీష్ కాలం నుండి డిమాండ్ ఉందని చెప్పారు. ఈడబ్యూఎస్ లో 10 శాతం కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం ఆమోదించిందని అయితే జగన్ ప్రభుత్వంలో కాపుల రిజర్వేషన్ అమలు చేయకుండా నిలిపివేసినట్లు చెప్పారు. కాపులకు రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందంటూ జగన్ ప్రకటన చేసారని గుర్తు చేశారు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటూ కాపు సంక్షేమ సేన అనేక ఉద్యమాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈడబ్యూఎస్ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన రాష్ట్ర న్యాయస్థానంలో పిటీషన్ వేసినట్లు తెలిపారు. కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి జగన్ ప్రభుత్వం విముఖత తెలుపుతూ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన ఎన్డిఏ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ పై సానుకూలంగా స్పందిస్తూ న్యాయస్థానంలో కొత్త ఆఫిడివిట్ దాఖలు చేయాలని కోరారు. త్వరలో కాపు రిజర్వేషన్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
