మళ్లీ గెలుస్తున్నాం..

May 17,2024 08:10 #cm jagan, #I Pack team, #meet
  • గతం కంటే ఎక్కువ సీట్లతో చరిత్ర సృష్టిస్తాం
  • సిఎం జగన్మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మరోసారి తామే గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలోని ఐప్యాక్‌ కార్యాలయంలో టీమ్‌ సభ్యులతో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్‌ స్థానాలో గెలవగా, ఈ సారి అంతకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించనున్నట్లు చెప్పారు. వైసిపి గెలుపుకోసం కృషి చేసిన టీమ్‌ సభ్యులను ఆయన అభినందించారు. రాష్ట్రంలో మరోసారి వైసిపి ప్రభంజనం ఖాయమని చెప్పారు. జూన్‌4వ తేదీన రాబోయే ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్‌ అవుతుందన్నారు. ఫలితాల తర్వాత దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తుందన్నారు. ఐప్యాక్‌ మాజీ అధినేత పశాంత్‌ కిషోర్‌ రాష్ట్రంలో ఫలితాలపై చెప్పిన జోస్యాన్ని ఆయన ప్రస్తావించారు. టీమ్‌ కృషి వల్లే ఐ ప్యాక్‌ గతంలో మంచి ఫలితాలను సాధించిందని చెప్పారు. ప్రశాంత్‌ కిషోర్‌ ఒక్కరే చేసిందేమి లేదన్నారు. ఇప్పుడు కూడా టీమ్‌ కృషే సానుకూల ఫలితాలు తీసుకువస్తుందని అన్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ అంచనాలకు భిన్నంగా ఫలితాలు ఉంటామని చెప్పారు. తాము ప్రభుత్వ సేవలకు కూడా ఐప్యాక్‌ను వినియోగించుకున్నామని, అందువల్ల వారికి ప్రజలతో మరింతగా అనుబంధమేర్పడిందని చెప్పారు. వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దామని ఐప్యాక్‌ సభ్యుల నుద్ధేశించి అన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️