రైతులకు భరోసా కల్పనే లక్ష్యం -ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

ఈ ఏడాది ఐదో విడత రైతుల ఖాతాల్లో జమ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రైతులకు భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది మూడో విడతగా రైతు భరోసా, పిఎం కిసాన్‌ మొత్తాలను బటన్‌నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఒక్కోక్కరికి రూ.13,500 చొప్పున నాలుగేళ్లు జమచేశామని, ఐదవ ఏడాదియైన ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటికి రెండు విడతలు అందించినట్లు తెలిపారు. మూడో విడతగా రెండువేల రూపాయల చొప్పున రూ.1,078 కోట్లను 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదేళ్లలో ప్రతి రైతుకు రూ.67,500 చొప్పున రూ.34,288 కోట్లు అందించినట్లు తెలిపారు.

రైతులకు సాగుభూమి తక్కువగా ఉండటంతో ప్రభుత్వ సాయం లేకపోతే రుణం అందడం కష్టంగా మారుతోందని తెలిపారు. బయట రుణాలు తీసుకున్నా ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని వివరించారు. ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఖరీఫ్‌లో రూ.7,500, పంటకోసే సమయంలో నాలుగువేలు, చేతికొచ్చే సమయానికి రూ.2,000 క్రమం తప్పకుండా ఇస్తున్నామని వివరించారు. అలాగే సున్నావడ్డీ పేరుతో రైతులకు మరోమేలు చేస్తున్నామని చెప్పారు. రుణాలు తీసుకున్న రైతులు సరైన సమయంలో చెల్లిస్తే వారి వడ్డీ తిరిగి ఇచ్చేస్తున్నామని చెప్పారు. ఇలా 10.79 లక్షల మంది రైతులకు రూ.216 కోట్ల వడ్డీని తిరిగి ఇచ్చేశామని తెలిపారు. తమది రైతుకష్టం తెలిసిన ప్రభుత్వమని చెప్పారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ క్రాప్‌ ద్వారా ఇన్సూరెన్స్‌ కవరేజీలోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. రైతుల తరుపున బీమా కడుతున్న ప్రభుత్వం ఎపిలోనే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎపి అగ్రిమిషన్‌ వైస్‌ఛైర్మన్‌ ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు తిరుపాల్‌రెడ్డి, ఉద్యానవనశాఖ సలహాదారు శివప్రసాదరెడ్డి, సిఎస్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్లు హరికిరణ్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️