15వ రోజు కొనసాగుతున్న సిఎం జగన్‌ బస్సు యాత్ర

Apr 15,2024 12:27 #ap cm jagan, #cm bus yatra

గన్నవరం : ‘మేమంతా సిద్ధం’ ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి సోమవారంనాడు కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. సోమవారం గన్నవరం మండలం కేసరపల్లి నుంచి యాత్ర ప్రారంభమైంది. రెండ్రోజులక్రితం విజయవాడ సింగ్‌నగర్‌లో సిఎంపై రాయి దాడి సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆయన విరామం తీసుకున్నారు. సోమవారం ఉదయం తిరిగి యాత్రను ప్రారంభించారు. కేసరపల్లి బస్సు యాత్ర వద్దకు స్థానికులు మాట్లాడటానికి రాగా రెండుసార్లు సిఎం బస్సు నుంచి బయటకు వచ్చి వారితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేసరపల్లిలోని క్యాంప్‌ వద్ద సిఎం వైఎస్‌ జగన్‌ను టిడిపి నేతలు దేవినేని గౌతమ్‌, దేవినేని స్మిత, కాంగ్రెస్‌ నాయకుడు కాకాని రామ్మోహనరావు మనువడు కాకాని విజరుకుమార్‌ కలిశారు. వారికి పార్టీ జెండాలు కప్పి సిఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బస్సుయాత్ర కేసరపల్లి, గన్నవరం, ఆత్కూరు, వీరవల్లిక్రాస్‌, హనుమాన్‌జంక్షన్‌, పుట్టగుంట మీదుగా యాత్ర జన్నపాడుకు చేరుకుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం జన్నపాడు, జనార్థనపురం మీదుగా బస్సుయాత్ర సాయంత్రం 3.30 గంటలకు గువాడ చేరుకుంటుంది. విజయవాడలో రాయి దాడి ఘటనతో పోలీసులు ముమ్మర బందోబస్తు నిర్వహించారు. సిఎం జగన్‌ పర్యటించే అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు పహారా కాశాయి. పూలుజల్లడం,క్రేన్‌లతో గజమాలలపై అధికారులు ఆంక్షలు విధించారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలో పాల్గన్నారు. రోడ్లు జనంతో నిండిపోయాయి. జాతీయ రహదారిపై రాకపోకలు ఆగిపోయాయి. విజయవాడ-విశాఖపట్టణం రూట్లో నడిచే అన్ని రవాణా సర్వీసులను నూజివీడు మీదుగా దారిమళ్లించారు. సాయంత్రం గుడివాడలో జరిగే బహిరంగ సభలో సిఎం ప్రసంగిస్తారు. అనంతరం ఏలూరుజిల్లా హనుమాన్‌జంక్షన్‌లో జాతీయరహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుంటారు. అనంతరం రాత్రి అక్కడ ఏర్పాటుచేసిన శిబిరంలో సిఎం బస చేస్తారు. సిఎం వెంట బస్సుయాత్రలో గన్నవరం శాసనసభ్యులు డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ తదితరులు పాల్గన్నారు.

➡️