తెలంగాణ : దేశ చరిత్రలోనే.. తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణనే అధికారిక సర్వే అని, దేశానికే ఇది రోల్ మోడల్ అని, రాబోయే పంచాయితీ ఎన్నికల్లో కులగణన ఆధారంగా సీట్లు ఇస్తామని, అధికారికంగా కులగణన అమలు చేసే బాధ్యత బీసీ కమిషన్‌దేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ … దేశంలోనే మొదటి సారి కుల గణన చేసి చరిత్ర సఅష్టించామన్నారు. పకడ్బందీగా సర్వే నిర్వహించి వివరాలు సేకరించామని తెలిపారు. తెలంగాణలో విజయవంతంగా కుల గణన కంప్లీట్ చేయడంతో, ఇక దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని ప్రధాని మోడీపైన ఒత్తిడి పెరుగుతోందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలనే డిమాండ్ మరింత ఎక్కువ అవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో బీసీ, ఎస్సీ మైనార్టీలకు న్యాయం జరగనుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళతామన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ నుంచి రోడ్ మ్యాప్ ఇస్తున్నామని, భవిష్యత్ లో తెలంగాణ డాక్యుమెంట్స్ ను రెఫరెన్స్ గా తీసుకోవాలని సూచించారు. 2011 జనాభా లెక్కల తర్వాత మళ్లీ తమ కాంగ్రెస్ ప్రభుత్వమే కుల గణన చేపట్టిందన్నారు. 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఎక్కడ ఉన్నాయో చేసిన వాళ్లే చెప్పాలన్నారు. కుల గణన రిపోర్టు, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్, అసెంబ్లీలో ఆమోద ముద్ర పడటంతో.. ఈ రోజు (ఫిబ్రవరి 4) దేశం చరిత్రలో నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే కాపీ చట్టం కాలేదని.. అసలు సర్వే ఎవరు చేశారో ఎందుకు చేశారో ఎవ్వరికీ చెప్పలేదన్నారు. ప్రభుత్వ అధికారికంగా సర్వే చేస్తే.. ఆ వివరాలు బయటపెట్టాలన్నారు. దేశ చరిత్రలో మేము చేసింది అధికారిక సర్వే అని అన్నారు. కులగణన నివేదికకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని.. ఈ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు. కుల గణనపై ప్రభుత్వం సభలో ప్రకటన చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. కుల గణన నివేదికపై చర్చ కు స్పీకర్ అవకాశం ఇస్తే సభలో చర్చ జరుగుతుందన్నారు.
