Legislature – న్యాయ విచారణ కోరిందీ.. వద్దంటుందీ.. వాళ్లే : సిఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ : విద్యుత్‌ అంశంలో న్యాయ విచారణ కోరిందే బిఆర్‌ఎస్‌ సభ్యులని, ఇప్పుడు వద్దంటున్నదీ వాళ్లేనని…విచారణలో వీళ్ల అవినీతి బయటకు వస్తుందనే అడ్డుకుంటున్నారు అని రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఉదయం శాసనసభలో పద్దులపై చర్చ కొనసాగుతోన్న వేళ … తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ …. జగదీశ్‌ రెడ్డి ఆవేదన చూస్తుంటే చర్లపల్లి జైలులో ఉన్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు, యాదాద్రి పవర్‌ప్లాంట్‌పై న్యాయ విచారణ జరుగుతోందని, విచారణ కమిషన్‌ ముందు వాదనలు వినిపిస్తే బిఆర్‌ఎస్‌ సభ్యుల నిజాయతీ బయటకు వస్తుందని చెప్పారు. న్యాయ విచారణ కోరింది వాళ్లే.. వద్దంటున్నది వాళ్లే…నని రేవంత్‌ అన్నారు. విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌ను సాయంత్రం నియమిస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. విద్యుత్‌ కోతలు ఉండకూడదని గతంలోనే రాజశేఖర్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. యుపిఎ ప్రభుత్వ నిర్ణయాల వల్లే హైదరాబాద్‌కు ఆదాయం పెరిగిందన్నారు. విద్యుత్‌ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్‌ విభజన జరిగేలా జైపాల్‌ రెడ్డి చేశారని, విభజన చట్టంలో లేని స్పీకింగ్‌ ఆర్డర్‌ను విద్యుత్‌ విషయంలో జైపాల్‌ రెడ్డి ఇప్పించారనీ.. జైపాల్‌ రెడ్డి కృషి వల్ల వినియోగం ఆధారంగా తెలంగాణకు 54 శాతం వచ్చేలా విద్యుత్‌ విభజన జరిగిందని రేవంత్‌ తెలిపారు. విభజన చట్టంలో తెలంగాణకు 36 శాతం, ఎపి కి 64 శాతం విద్యుత్‌ వచ్చేలా ఉందన్నారు. తెలంగాణను చీకట్ల నుంచి కాపాడింది జైపాల్‌ రెడ్డి అని చెప్పారు. సోనియా గాంధీ దయ, జైపాల్‌ రెడ్డి కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ సమస్య నుంచి గట్టెక్కిందన్నారు. విద్యుత్‌పై విచారణ కొనసాగించాలని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్‌ హయాంలో బిహెచ్‌ఎల్‌ నుంచి సివిల్‌ వర్క్స్‌ వరకు అన్నీ వాళ్ల బినామీలకే ఇచ్చారని ఆరోపించారు. రూ.వేల కోట్ల విలువైన పనుల్లో అవినీతి జరిగిందని… విచారణలో వీళ్ల అవినీతి బయటకు వస్తుందనే అడ్డుకుంటున్నారు అని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.

➡️