ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌ రెడ్డి.. సోనియాగాంధీతో భేటీ

తెలంగాణ: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం ఏఐసిసి అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయం, పార్టీలో తాజా రాజకీయ పరిణామాలు ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ నేతలతో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్‌ రెడ్డి ఇప్పటి వరకు మంత్రివర్గాన్ని విస్తరించలేదు.
తాజాగా లోక్‌సభ ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించనున్నట్లు సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపదాస్‌ మున్సి కూడా పాల్గంటారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు వంశీ చంద్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఇతర నేతలు కూడా హాజరుకానున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు అత్యంత సన్నిహితులకు అవకాశం ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అందరికీ సీట్లు ఇచ్చే అవకాశం లేదు. అలాంటి వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటామని గతంలో రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఇద్దరు ముగ్గురు నేతలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే పార్టీ అగ్రనాయకత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్ లభిస్తే తదుపరి ప్రక్రియను పూర్తి చేసేందుకు రేవంత్‌ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.

➡️