అమరావతి : ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులపై సిఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నేడు సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కొన్ని విషయాల్లో ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా? అంటూ కొంతమంది మంత్రులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో గోవుల మృతిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాన్ని తిప్ప కొట్టడంలో మంత్రులు వైఫల్యం చెందారని సిఎం మండిపడ్డారు. దేశంలో ఎక్కడా అమలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తుంటే.. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలం అవుతున్నారని ఆయన దుయ్యబట్టారు. జిల్లాలు యూనిట్‌గా తీసుకొని పార్టీ, ప్రభుత్వం, మంత్రులు సమన్వయంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. ఇలాంటి విషయాల్లో ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల తీరిలో మార్పు రావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తిగత కార్యదర్శులు, వోఎస్‌డీలు చేస్తున్న తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయి. వాటిని సరిదిద్దుకోవాలని హెచ్చరించారు. అలాగే అవినీతి అధికారులకు దూరంగా ఉండంగా.. వారిని మీరు దూరం పెట్టండి అని మంత్రులకు చంద్రబాబు జాగ్రత్తలు సూచించారు. మత పరమైన అంశాలపై సంయమనంతో స్పందించాలన్న ఆయన.. ఎన్ని సార్లు చెప్పినా మీలో మార్పు కనపడడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. చేసింది చెప్పుకోలేకపోతున్నాం. సరిగ్గా స్పందించలేకపోతున్నాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. మొత్తం 24 అజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం జరిగింది. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. ఇక, ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.