‘సిఎం’ స్థలం కబ్జాపై కదలిక

ప్రజాశక్తి-బాపట్ల : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేరు మీద ఉన్న స్థలాన్ని కబ్జా చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాపట్లలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్‌ ద్వారా అక్రమార్కులు కాజేసిన విషయం అధికారుల దృష్టికి రావడంతో వెంటనే చర్యలు ప్రారంభించారు. బాపట్లకు చెందిన టిడిపి సీనియర్‌ నాయకుడు మువ్వా సుబ్బారావు అనే వ్యక్తి టిడిపి కార్యాలయం కోసం 2000లో శ్రీనివాసనగర్‌ కాలనీలో ఉన్న 9.5 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. దాన్ని అప్పటి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేరు మీద బాపట్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ తరువాత టిడిపి అధికారంలో లేకపోవడంతో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టలేదు. కోట్ల రూపాయల విలువచేసే ఈ స్థలంపై అనేక మంది కన్నేశారు. ఈ నేపథ్యంలో 2010లో నకిలీ డాక్యుమెంట్‌ పత్రాలతో బాపట్లకు చెందిన సత్యానందం, నక్క సత్తార్‌రెడ్డి అనే వ్యక్తులు అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ డ్యాకుమెంట్లను పెట్టి బ్యాంకులో రుణం కోసం సత్తార్‌రెడ్డి అనే వ్యక్తి ప్రయత్నించగా బ్యాంకు అధికారులు పట్టుకున్నారు. ఈ స్థలం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయి ఉందని తెలిసి ఖంగు తిన్నారు. టిడిపి నాయకులు బాపట్ల పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సత్తార్‌రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీ సులు, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.

➡️