నేటి నుంచి సిఎం దావోస్‌ పర్యటన

Jan 19,2025 02:29 #AP CM Chandrababu Naidu, #Davos

నాలుగు రోజుల పాటు పర్యటన
మిట్టల్‌తో ప్రత్యేక సమావేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటనకు ఆదివారం వెళ్లనున్నారు. అక్కడ జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సుకు ఆయన హాజరు అవుతారు. సిఎం కార్యాలయం తెలిసిన సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి, అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తన బృందంతో కలిసి జ్యూరిచ్‌కు చేరుకుంటారు. అక్కడ ఇండియన్‌ అంబాసిడర్‌తో భేటీ అవుతారు. అనంతరం హిల్టన్‌ హోటల్‌లో 10 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి హోటల్‌ హయత్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో కలిసి సమావేశంలో పాల్గొంటారు. మీట్‌ అండ్‌ గ్రీట్‌ విత్‌ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహించే ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై, ఎపిని ప్రమోట్‌ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చిస్తారు. అక్కడ నుంచి దావోస్‌ చేరుకొని రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు.
తరువాత అర్సెల్లార్‌ మిట్టల్‌ ఎగ్జిక్యూటీవ్‌ చైర్మన్‌ లక్ష్మీమిట్టల్‌తో ప్రత్యేకంగా సమావేశమవుతారు. తొలి రోజు సమావేశాలు ముగించుకుని హోటల్‌కు చేరుకుంటారు. రెండవ రోజు సిఐఐ సెషన్స్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ అంశంపై చర్చల్లో పాల్గొంటారు. అనంతరం సోలార్‌ ఇంపల్స్‌, కోకకోలా, వెల్‌స్పన్‌, ఎల్‌జి, కార్ల్స్‌ బర్గ్‌, సిస్కో, వాల్‌ మార్ట్‌ ఇంటర్‌ నేషనల్‌, కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌, వంటి సంస్థల సిఇఒలతో, ఛైర్మన్‌లతో సమావేశం అవుతారు. అదేవిధంగా వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం నిర్వహిస్తున్న పలు అంశాలపై జరిగే చర్యలో పాల్గొంటారు. బూమ్‌ బర్గ్‌ వంటి మీడియా సంస్థలకు ఇచ్చే ఇంటర్వూల్లో ఎపి ప్రభుత్వ పాలసీలను వివరిస్తారు. మూడవ రోజు పలువురు బిజినెస్‌ టైకూన్లతో సమావేశం అవుతారు. నాల్గవ రోజు ఉదయం దావోస్‌ నుంచి జ్యూరిచ్‌కు చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు. సిఎం బృందంలో పరిశ్రమల శాఖ మంత్రి టి.బి భరత్‌, ఐటి మంత్రి నారా లోకేష్‌తోపాటు పరిశ్రమల ఉన్నతాధికారులు, తదితరులు ఉన్నారు.

➡️