శాఖల సమన్వయంతో అభివృద్ధి 

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-శ్రీకాకుళం :  ప్రజలకు పారదర్శక పాలన అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రభుత్వంలో శాఖల సమన్వయంతో అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరుతాయని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో డీఆర్డీఏ, డ్వామా, ఎస్సీ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన పంటలకు, పశు పోషణ ప్రోత్సాహానికి నూరు శాతం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యకర్తల ప్రేమాభిమానాలే పదివేల పూలదండలతో సమానమని ఆయన అన్నారు. తనను కలిసేందుకు వచ్చే వారు శాలువాలు, పూలదండలు, పుష్పగుచ్చాలు వంటివి తీసుకురావద్దని తెలిపారు.

➡️