- ప్రభుత్వ మాజీ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాటపట్టిన అంగన్‌వాడీల పట్ల కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు నలమారు చంద్రశేఖరరెడ్డి అన్నారు. మంగళవారం వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే మర్చిపోయారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పాలన ఉద్యోగ వ్యతిరేక పాలనగా సాగుతోందని అన్నారు. డిసెంబర్ 2023న కుప్పంలో జరిగిన మీటింగులో అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీల సమస్యలు నేరవేరుస్తామని చంద్రబాబునాయుడు హామీనిచ్చారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన తీరు పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. తమ బాధలు వినిపించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వస్తున్న అంగన్‌వాడీ వర్కర్లను విజయవాడలోకి రానీయకుండా పోలీసులను మోహరించి ఎక్కడికక్కడ నిలిపేశారని తెలిపారు. ట్రైన్లలో నిద్రపోతున్న అంగన్‌వాడీల ఫోటోలు తీసి పోలీసులు వారికి షోకాజు నోటీసు ఇవ్వాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.