- రాజధాని అదనపు భూములపై మంత్రి నారాయణ
- ప్రధాని సభకు మూడు వేదికలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని అదనపు భూముల విషయంలో ప్రజలు అంగీకరిస్తే సమీకరణ చేస్తామని, లేనిపక్షంలో భూసేకరణ చేస్తామని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. వెలగపూడిలో ప్రధాని మోడీ పర్యటన, సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అక్కడే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సభ కోసం మూడు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని, పనులు 90 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. వేదికపై రైతులను గౌరవించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. సభావేదిక వద్దకు వచ్చేందుకు అవసరమైన రోడ్లను బాగుచేస్తున్నామని, 11 పార్కింగు స్థలాలనూ గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం అమరావతి అభివృద్ధి చెందాలంటే అదనపు భూమి అవసరం ఉందని అన్నారు. ఎయిర్ పోర్టులు, ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. దీనికోసం ప్రస్తుతం అమరావతిలో ఉన్న భూమి చాలదని అన్నారు. అదనపు భూమి కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. అంగీకరిస్తే పూలింగు ప్రక్రియ చేపడతామని, లేనిపక్షంలో సేకరణకు వెళ్లే అంశంపై ఆలోచన చేస్తున్నామని వివరించారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఉండాలంటే స్మార్ట్ ఇండిస్టీస్ రావాలని అన్నారు. భూముల విలువ పెరగాలన్నా, నిలవాలన్నా ప్రజలు ఉండాల్సిందేనని అన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వస్తేనే స్మార్ట్ ఇండిస్టీస్ వస్తాయని, అందుకనే ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.