ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టరేట్‌ల నిర్మాణానికి దాతల సహకారం తీసు కుంటామని ప్రభుత్వం తెలిపింది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా శాసన సభలో సోమవారం ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. రెవిన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ పి4 విధానంలో భాగంగా దాతల సహకారంతో పాటు ఇతర విధానాలను కలెక్టరేట్ల నిర్మాణానికి అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంపై ఆర్ధిక భారం లేకుండా ఉండే మేలైన విధానాన్ని ఎంపిక చేసి వీటి నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని జిల్లా కార్యాలయాలు ఒకే చోట ఉండే విధంగా, ప్రతి కలెక్టరేట్‌కు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు గతంలోనే అందాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కలెక్టరేట్లకు రూ.1,434 కోట్ల మేర ఖర్చవుతుందని తెలిపారు.
