ప్రజాశక్తి – నూజివీడు టౌన్ : ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు చదువుకునేందుకు అనువైన మంచి వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి త్రిబుల్ ఐటీ అధికారులను ఆదేశించారు. ఇటీవల త్రిబుల్ ఐటీలో ఆహార నాణ్యత, విద్యార్థుల అనారోగ్యం, విద్యార్థుల ఆందోళన, తదితర పరిస్థితులపై నూజివీడులోని మంత్రి క్యాంప్ ఆఫీసు నందు శుక్రవారం ఉదయం ట్రిపుల్ ఐటీ లో అధికారులతో శుక్రవారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైనట్రిపుల్ ఐటీ విద్యా సంస్థలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం, తరచూ పునరావృతం కావడం బాధాకరమన్నారు. కొత్తగా వచ్చిన డైరెక్టర్ ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు సరిచేసి, పాత మెస్ కాంట్రక్టర్ ను తొలగించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆహరం తయారీకి ఉపయోగించే వస్తువుల నాణ్యత, ఆహార నాణ్యత, కిచెన్ పరిసరాలు పరిశుభ్రత, విద్యార్థుల భద్రతా, తదితర అంశాలు పరిశీలన, పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆహారం తయారీ యంత్రాలు, తయారీలో వాడే వంట పాత్రలు, అన్నీ కొత్తవి, కొనుగోలు చేసి వాడాలని, పేరున్న బ్రాండెడ్ కంపెనీ వస్తువులు మాత్రమే కొనుగోలు చేసి వాడాలని అధికారులకు ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలో సిబ్బంది నియామకంలో పోలీసు వారి సహకారంతో నేర చరిత్ర లేనివారిని నియమించాలని, ఫుడ్ కోర్ట్, ఇతర ఆహార తయారీ మెస్, స్నాక్స్, వంటి ఆహార పదార్ధాలు, మెప్మా , డ్వాక్రా గ్రూప్ వారి సౌజన్యంలో పూర్తి నాణ్యత గల ఆహారం అందించే విషయాన్నీ పరిశీలించాలన్నారు. అంతే కాక విద్యార్థులకు పూర్తి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెలూన్, స్నాక్స్ షాపులు ఏర్పాటు, వాషింగ్ మిషన్ సేవలు కూడా తక్కువ ధరలకే అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేయాలన్నారు. సరసమైన రేటులకు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మరియు ఫుడ్ కమిటీలో విద్యార్థులను కూడా నియమించాలని ఆదేశించారు. ప్రభుత్వ, పారిశ్రామికవేత్తల, స్వచ్చంద సంస్థల సహకారంతో ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థను రాష్ట్రంలోనే ఒక మోడల్ గా తీరిదిద్దాలని మంత్రి డైరెక్టర్ అమరేంద్రరావు ను ఆదేశించారు. కళాశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రాజకీయాలకు తావులేకుండా పనిచేయాలని రాజకీయం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నూజివీడుట్రిపుల్ ఐటీలో కిచెన్, మెస్ లను పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు, ప్రతీ మెస్ పరిధిలో ఆహార నాణ్యత, తయారీ లో నాణ్యతలను పరిశీలించేందుకు అధ్యాపకులు, విద్యార్థులతో కమిటీలను ఏర్పాటుచేయాలని, కమిటీలలో విద్యార్థులకు ప్రధాన పాత్ర ఇవ్వాలన్నారు. సి.సి, కెమెరాలు ఏర్పాటు వంటి భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాలనీ మంత్రి ఆదేశించారు.