- జగన్‌కు తమిళనాడు మంత్రి వేలు ఆహ్వానం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు వ్యతిరేకంగా ఈనెల 22న చెన్నైలో జరగనున్న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి హాజరు కావాలని తమిళనాడు పిడబ్ల్యుడిశాఖ మంత్రి వేలు వైసిపి అధ్యక్షులు జగన్‌ను ఆహ్వానించారు. బుధవారం తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఎంపి విల్సన్‌తో కలిసి మంత్రి ఆహ్వానపత్రం అందించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు సిఎం స్టాలిన్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే మంత్రి జగన్‌ను ఆహ్వానించారు.
మహిళలను మోసం చేసిన ప్రభుత్వం : ఎమ్మెల్సీ కల్యాణి
కూటమి ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసిందని వైసిపి మహిళా విభాగం అధ్యక్షులు వరుదు కల్యాణి విమర్శించారు. బుధవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీల్లో ఉచిత బస్, ఆడబిడ్డనిధి, తల్లికివందనం, దీపం పథకం వంటివి అమలు చేయలేదని తెలిపారు. వైసిపి హయాంలోనే మహిళలకు న్యాయం జరిగిందని వివరించారు.
హత్యారాజకీయాలు చంద్రబాబువే : లక్ష్మీపార్వతి
హత్యారాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడని ఆయన ఎదుగుదల అంతా కుట్రలు, కుతంత్రాలతోనే ముడిపిందని వైసిపి ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి విమర్శించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తొలిసారి సిఎం అయినప్పటి నుండి ఆయన అరాచక పాలన చేశారని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో హత్యలను ప్రోత్సహించాడని విమర్శించారు.
యువతపోరు విజయంతం : లేళ్ల అప్పిరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యువత పోరు విజయవంతం అయిందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. తొమ్మిది నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత వచ్చిందని, హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.