- ఆర్‌అండ్‌ఆర్ కార్యాలయం ముందు వ్యకాస ఆందోళన
- నెలరోజుల సమయం కోరిన కమిషనర్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రాజెక్టుల కోసం భూమిని తీసుకున్న ప్రభుత్వం.. వాటిని కోల్పోయిన రైతులకు న్యాయం చేయలేదని, మూడు నెలల్లో సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల ముందు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీనిచ్చినా పరిష్కారానికి నోచలేదని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లాలో బెల్, నాసన్ కంపెనీలు సేకరించిన 800 ఎకరాలకు, అన్నమయ్య జిల్లాలో ముదివేడు రిజర్వాయర్‌కు తీసుకున్న 700 ఎకరాలకు పరిహారం ఇవ్వలేదని, వెంటనే ఇప్పించాలని కోరుతూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన మంగళవారం గొల్లపూడిలోని ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ కార్యాలయం ముందు వందలాదిమంది ఆందోళన చేపట్టారు. సమస్య పరిష్కరించేవరకూ అక్కడ నుండి కదలబోమని భైఠాయించారు.
ఈ సందర్భంగా వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సత్యసాయి జిల్లా బెల్ కంపెనీ, నాసన్ కంపెనీలు మూడు గ్రామాల పరిధిలో 800 ఎకరాలకుపైగా భూమి సేకరించినా ఇప్పటికీ ఆర్‌అండ్‌అర్ కింద పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగిన ప్రజలపై ఏడు కేసులు పెట్టారని, ఇదెంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల ముందు మూడు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చినా ఇప్పటి వరకూ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ఎవరికీ రూపాయి పరిహారం అందలేదని, పైగా అధికారులు తీవ్ర ఇబ్బందుల పాల్జేస్తున్నారని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో ముదివేడు రిజర్వాయర్‌కు మూడు గ్రామాల్లో 700 ఎకరాలు తీసుకున్నారని, వారికీ పరిహారం అందలేదని వివరించారు. ఈ ప్రాంతంలో ఎకరాకు పది లక్షల నుండి రూ.15 లక్షల విలువైన టమాటాలు పండుతాయని తెలిపారు. అంత విలువైన భూమిని రైతుల నుంచి తీసుకుని వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. తమకు న్యాయం చేయాలని భూ యజమానులు ఆందోళనలు చేపడితే అధికారులు వేధింపులకు గురిచేశారని అన్నారు. దీంతో సహనం కోల్పోయిన లబ్ధిదారులు తాడోపేడో తేల్చుకునేందుకు కమిషనర్ కార్యాలయం వద్దకు వచ్చారని వివరించారు. సాయంత్రం వరకూ ఆందోన కొనసాగడంతో వారివద్దకు వచ్చిన కమిషనర్ తాను కొత్తగా వచ్చానని, నెలరోజులు సమయం ఇవ్వాలని కోరారు. అనంతరం కార్యాలయంలోకి వెళ్లి రైతులు వారి సమస్యలను కమిషనర్‌కు విన్నవించారు. దీనిపై నెలరోజుల్లో ప్రభుత్వానికి లిస్టు పంపి న్యాయం చేసేలా చూస్తానని తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే కమిషనర్ కార్యాలయం ముందే నిరవధిక నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, రాష్ట్ర నాయకులు శివనాగరాణి, సత్యసాయి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రవీణ్, పెద్దన్న, అన్నమయ్య జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.