వరదల్లో దెబ్బతిన్న వ్యవసాయ పరికరాలకు పరిహారం ఇవ్వాలి

  • ఎపి కౌలురైతు, ఎపి రైతు సంఘాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణానది, బుడమేరు వరదల్లో నష్టపోయిన కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతుల వ్యవసాయ మోటార్లు, ఆయిల్‌ ఇంజిన్లు, వ్యవసాయ పరికరాలు ఎన్యూమరేషన్‌ చేసి పరిహారం ఇవ్వాలని ఎపి కౌలు రైతు సంఘం, ఎపి రైతు సంఘం డిమాండ్‌ చేశాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ను బుధవారం కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు, రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. అసైన్డ్‌, లంక భూములు, ప్రభుత్వ పోరంబోకు, గ్రామ కంఠాలు వంటి భూముల్లో పంటలు వేసినప్పటికీ ఎన్యూమరేషన్‌ చేయలేదని, తక్షణమే ఆ భూముల్లో దెబ్బతిన్న పంటను ఎన్యూమరేషన్‌ చేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వరి పంటకు రూ.25 వేలు, కంద, పసుపు వంటి వాణిజ్య పంటలకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకూ పరిహారం పెంచాలని కోరారు. వరద ముంపునకు గురైన ఇళ్లకు విజయవాడ నగరంలో చెల్లించినట్లుగా గ్రామాల్లోనూ కనీసం రూ.25 వేలు చెల్లించాలని, రాజకీయ వివక్ష లేకుండా అందరినీ ఆదుకోవాలన్నారు. లంకల్లో ఇసుక మేట వేసిన భూములను ఎన్యూమరేషన్‌ చేసి నష్టపరిహారం పెంచి ఇవ్వాలని, మేట వేసిన ఇసుకను తొలగించడానికి ఎకరాకు 50 మంది కూలీలను ఉపాధి పథకంలో కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయశాఖ ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో కొద్ది మొతాదులో కౌలు రైతుల పేర్లు నమోదు చేసినప్పటికీ, పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు.

➡️