కృష్ణా సిమెంటు కార్మికులకు నష్టపరిహారం ఇప్పించాలి

  •  సిఎస్‌కు సిపిఎం లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కృష్ణా సిమెంటు కంపెనీ యాజమాన్యం అక్రమ లాకౌట్‌ వల్ల కార్మికులకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డికి లేఖ రాశారు. ఎసిసి సిమెంటు కంపెనీకి చెందిన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణా సిమెంటు యాజమాన్యం 1993లో అక్రమ లాకౌట్‌ ప్రకటించిందని తెలిపారు. దీనిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లాకౌట్‌ అక్రమమని జిఓ ఇచ్చిందని పేర్కొన్నారు. అయినా కంపెనీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరించడంతో కార్మికులు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. కంపెనీ సంబంధిత ఆస్తులు అమ్మి కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఆస్తులను ఎవరైతే వేలం పాటలో పాడుకుంటారో వారే కార్మికులకు బకాయిలు చెల్లించాలని వేలం షరతుల్లో పొందుపరిచిందని అన్నారు. లాకౌట్‌ ప్రకటించి ఇప్పటికి 31 ఏళ్లు పూర్తయిందని, 150 మందికిపైగా కార్మికులు చనిపోయారని పేర్కొన్నారు. దీనిపై జోక్యం చేసుకుని కంపెనీ నుండి కార్మికులకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చేలా కృషి చేయాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

➡️