టిడిపి నేతల దాడిపై ఫిర్యాదు

Jun 10,2024 22:00 #attack, #TDP, #YCP Leader
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : వైసిపికి చెందిన తనను గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టిడిపి నాయకులు చిత్రహింసలకు గురిచేయడంతోపాటు అర్ధనగంగా మోకాళ్లపై కూర్చోబెట్టి లోకేష్‌ ఫొటోకు క్షమాపణలు చెప్పించారని బాధితుడు రాజ్‌కుమార్‌ సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం జూపూడికి చెందిన పాలేటి రాజ్‌కుమార్‌ బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ పనులు చేస్తుంటారు. ఉద్యోగం నిమిత్తం మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. రాజ్‌కుమార్‌ భార్య కృష్ణవేణి వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇటీవల ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో పని చేశారు. ఇటీవల వేసవి సెలవుల నిమిత్తం రాజ్‌కుమార్‌ కుటుంబం చిలకలూరిపేట మండలం బొప్పూడిలోని అత్తగారింటికి వచ్చింది. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకుడు జవ్వాది కిరణ్‌ తన అనుచరులైన నరేంద్ర, షేక్‌ బాజీ, జానీ, జానీ సోదరుడితో పాటు మరికొందరు ఆదివారం సాయంత్రం బొప్పూడికి వచ్చారు. కుటుంబీకులతో ఉన్న రాజ్‌కుమార్‌ను దూషిస్తూ ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేశారు. ఆయన భార్యతో పాటు అత్త అనురాధ, బావమరిది భార్య విజయలక్ష్మిని దుర్భాషలాడారు. అనంతరం రాజ్‌కుమార్‌ను కారులో మంగళగిరికి తీసుకొచ్చి దాడి చేశారు. లోకేష్‌ బొమ్మ ఉన్న జెండా ఎదుట అర్ధనగంగా మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు. సోమవారం ఉదయం యడ్లపాడు మండలం బోయపాలెం హైవే పక్కన కారులో నుండి కిందకు తోసేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్‌కుమార్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించామని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రవికృష్ణ తెలిపారు.

➡️