- బియ్యం గోల్‌మాల్‌పై పౌరసరఫరాల సంస్థ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ ఫిర్యాదు
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపైనా, పౌరసరఫరా సంస్థ గోదాము మేనేజర్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రయివేట్ గోదాములో పౌరసరఫరాల శాఖ ఉంచిన బియ్యం గోల్‌మాల్ అయినట్లు కృష్ణా జిల్లా బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. జయసుధ నుంచి పౌరసరఫరాల సంస్థ బందరు మండలం పొట్టపాలెంలో గోదామును లీజుకు తీసుకుంది. బఫర్ గోదాములో ఉంచిన బియ్యం నిల్వల్లో వ్యత్యాసం ఉన్నట్లు ఆ సంస్థ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది రోజుల క్రితం గోదాములో నిర్వహించిన తనిఖీల్లో 185 టన్నుల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులుగా పేర్కొంటూ పేర్ని సతీమణి జయసుధ, గోదాము మేనేజర్ మానస తేజలపై ఫిర్యాదు చేశారు. దీంతో, ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని దారి మళ్లించి దుర్వినియోగపరిచినట్లుగా వారిద్దరిపై పోలీసులు 316 (3), 316 (5), 61 (2) రెడ్ విత్ 3 (5) బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బందరు తాలూకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏసుబాబు దర్యాపు చేస్తున్నారు. వేబ్రిడ్జి సరిగా పనిచేయకపోవడం వల్ల బియ్యం నిల్వల్లో తరుగు కనిపిస్తోందని పౌరసరఫరాల సంస్థ అధికారులకు జయసుధ లేఖ రాసినట్లు తెలుస్తోంది. నాని మంత్రిగా ఉన్న సమయంలో ఈ గోదామును నిర్మించి, పౌరసరఫరాల సంస్థకు బఫర్ గోదాముగా లీజుకు ఇచ్చినట్లు సమాచారం.