సొంత కాంట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తున్నారని ఫిర్యాదు

May 14,2024 20:54 #ap governer, #chandrababu, #TDP
  •  గవర్నరుకు చంద్రబాబు లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :  లబ్ధిదారులకు చెందాల్సిన నిధులను సిఎం జగన్‌ సొంత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని, తక్షణమే దీనిని నిలుపుదల చేయాలని గవర్నరు అబ్దుల్‌ నజీర్‌కు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం లేఖ రాశారు. జగన్‌ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్ధమైందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌కు నెలల ముందు డిబిటి పథకాలకు ముఖ్యమంత్రి అధికారికంగా బటన్‌ నొక్కినా గడువులోపు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. ‘అప్పులపైన ఆధారపడి రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్న విషయం మీకు తెలిసిందే. ప్రభుత్వ నిర్వహణ కోసం భారత రిజర్వ్‌ బ్యాంకు, బ్యాంకుల నుంచి తరచూ ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లింది. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు, పిఎఫ్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఆరోగ్య శ్రీకి బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపేస్తామని ఆస్పత్రి యాజమాన్యాలు చెప్తున్నాయి. ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా పంచాయతీరాజ్‌కు చెందాల్సిన నిధులనూ ప్రభుత్వం దారి మళ్లించింది. రుణాల కింద రూ.4 వేల కోట్లు, బాండ్ల ద్వారా రూ.7 వేల కోట్లను ప్రభుత్వం సమీకరించింది. ఈ నిధులన్నీ ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నం చేస్తోంది’ అని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే రాజకీయ స్వార్థం కోసం చేసే ఇటువంటి పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదముందని, లబ్ధిదారులకు మేలు చేసే డిబిటి పథకాలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని చంద్రబాబు ఆ లేఖలో గవర్నర్‌ను కోరారు.

➡️