బొత్సపై ఫిర్యాదు

  • టీచర్ల బదిలీలతో రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయుల బదిలీల పేరుతో రూ.కోట్లు దండుకున్న విద్యాశాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు అధికారులపై విచారణ చేపట్టి, అరెస్టు చేయాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఎసిబి కార్యాలయంలో ఎస్‌పి రవిప్రకాష్‌ను కలిసి సోమవారం వర్ల ఫిర్యాదు చేశారు. బదిలీల పేరుతో ఉపాధ్యాయుల నుంచి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు చొప్పున దాదాపు రూ.60 కోట్లు దండుకున్నారని ఆరోపించారు. బొత్సతోపాటు అతని పిఎ, కమిషనరేట్‌లో కీలకమైన అధికారి ఇళ్లపై దాదాపు 1,600 మంది ఉపాధ్యాయులు దాడి చేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. బదిలీలైన ఉపాధ్యాయులను విచారిస్తే వీళ్ల బాగోతం బయటపెడతారని చెప్పారు. పర్యాటకశాఖలో జరిగిన అవినీతిపై కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు షేక్‌ రఫీ, జగదీష్‌ బాబు, కోడూరి అఖిల్‌, వల్లూరి కిరణ్‌ తదితరులు ఉన్నారు.

ఆగని వైసిపి నేతల అరాచకాలు : కొమ్మారెడ్డి
వైసిపి నేతల అరాచకాలు ఆగడం లేదని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని, చట్టం ప్రకారం తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో తమ పార్టీ నేత గిరినాథ్‌ చౌదరిని అత్యంత కిరాతకంగా వైసిపి మూకలు హతమార్చారని ఆరోపించారు.

➡️