17 నుంచి టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Mar 12,2025 23:37 #1oth exams, #ap government
  • ఫేక్‌ న్యూస్‌, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు
  • కలెక్టర్లు, ఎస్‌పిలతో సిఎస్‌ సమీక్ష

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుండి ఏప్రిల్‌ 1వ తేదీ వరకూ 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఆదేశించారు. పదవ తరగతి పరీక్షలపై బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలతో పరీక్షల సన్నాహాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ మినహా ఎవరూ మొబైల్‌ ఫోన్‌ తేకూడదని, ఎవరైనా తీసుకువస్తే వాటిని పరీక్షా కేంద్రాల ప్రధాన గేటు వద్దే భద్రపర్చి పరీక్ష అనంతరం తిరిగి అప్పగించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ణలు విధించాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలోని జెరాక్సు, నెట్‌ సెంటర్లన్నీ మూసి ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సిఎస్‌ విజయానంద్‌ ఆదేశించారు. పరీక్షల సమయంలో సోషల్‌ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో పేపరు లీకు వంటి వదంతులు లేదా ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్‌, ఎస్‌పిల ఆధ్వర్యాన జిల్లాస్థాయి అధికారులతో కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశాలు నిర్వహించుకోవాలని చెప్పారు. సెన్సిటివ్‌ పరీక్షా కేంద్రాలపై దృష్టి సారించాలని కలెక్టర్లను సిఎస్‌ విజయానంద్‌ ఆదేశించారు.
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయ రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో 163 సెన్సిటివ్‌ పరీక్షా కేంద్రాలుగా గుర్తించి సిసిటివి కెమెరా సర్వెలెన్స్‌ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 6లక్షల 19వేల 275 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కానున్నారని, వారిలో 3లక్షల 15వేల 697 మంది బాలురు, 3లక్షల 3వేల 578 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. కర్నూల్‌, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, 682 సిట్టింగ్‌ స్క్వాడ్‌ బందాలను, ప్రతి జిల్లాకు ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమించామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 08662974540 నెంబరుతో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, జిల్లాల్లోనూ ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు.
ఈ నెల 17 నుండి 28 వరకూ 10వ తరగతి (ఓపెన్‌ స్కూల్‌) పబ్లిక్‌ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకూ జరగనున్నాయని, ఈ పరీక్షలకు 30,334 మంది హాజరు కానున్నారని డైరెక్టర్‌ విజయ రామరాజు చెప్పారు. ఈ పరీక్షలను కూడా 471 రెగ్యులర్‌ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.

➡️