అనకాపల్లి : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా పేలుడు ఘటనలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. సోమవారం నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఆరు, అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భౌతికకాయాలను వారివారి బంధువులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైనవారికి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన 8 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. క్షతగాత్రుల్లో ఇద్దరికి నర్సీపట్నం ఆసుపత్రిలో, నలుగురికి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
